క్రికెట్ ప్రపంచంలో ఎన్నో ఏళ్లుగా వినిపిస్తున్న ఒక రూమర్‌కు ఎట్టకేలకు బ్రెట్ లీ ఫుల్ స్టాప్ పెట్టాడు. బాలీవుడ్ నటి ప్రితీ జింటాతో తనకు ప్రేమాయణం ఉందంటూ వచ్చిన వార్తలపై ఇన్నేళ్ల తర్వాత తొలిసారి స్పందించాడు. అసలు బ్రెట్ లీ, ప్రితీ జింటా మధ్య ఏం జరిగింది? వాళ్లిద్దరూ నిజంగానే డేటింగ్ చేశారా? లేక ఇదంతా కేవలం రూమర్ మాత్రమేనా? 2008లో IPL మొదటి సీజన్ ప్రారంభమైన సమయంలో, బ్రెట్ లీ కింగ్స్ XI పంజాబ్ జట్టులో చేరాడు. ఆ జట్టుకు ప్రితీ జింటా కూడా సహ యజమానిగా ఉన్నారు. బ్రెట్ లీ 2008 నుంచి 2010 వరకు ఆ జట్టులో కొనసాగాడు. ఆ తర్వాత 2011లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులోకి వెళ్లాడు. అయితే బ్రెట్ లీ, ప్రితీ జింటా కలిసి కనిపించడంతో అప్పట్లో వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ వార్తలు వచ్చాయి.
ఈ రూమర్స్ ఎన్నోసార్లు బయటకు వచ్చినా.. బ్రెట్ లీ మాత్రం వాటిపై ఎప్పుడూ స్పందించలేదు. కానీ ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బ్రెట్ లీ ఈ రూమర్స్‌పై మౌనం వీడాడు. తాను ఎప్పుడూ ఏ బాలీవుడ్ నటితో డేటింగ్ చేయలేదని బ్రెట్ లీ స్పష్టంగా చెప్పాడు. ప్రితీ జింటా, తాను అప్పట్లో కూడా మంచి స్నేహితులమేనని.. ఇప్పటికీ మంచి స్నేహితులమేనని తెలిపాడు. అంతేకాదు.. అప్పట్లో ప్రితీ జింటా పంజాబ్ జట్టుకు బాస్‌లా ఉండేవారని, ఆమె చాలా తెలివైన మహిళ అని బ్రెట్ లీ ప్రశంసించాడు. ఆమెపై తనకు ఎంతో గౌరవం ఉందని చెప్పాడు.
తన గురించి ఇలాంటి కథనాలు వచ్చినా అవి తనను ఎప్పుడూ బాధించలేదని బ్రెట్ లీ తెలిపాడు. ఎందుకంటే అసలు నిజం తనకు తెలుసని, ఎవరు ఏమైనా ఊహించుకోవచ్చని, కానీ వాటిని తాను ఎప్పుడూ పట్టించుకోలేదని చెప్పాడు. అయితే బ్రెట్ లీ కంటే ముందే 2010లో ప్రితీ జింటా కూడా ఈ రూమర్స్‌పై స్పందించారు. ప్రతి సంవత్సరం తనను బ్రెట్ లీతో లింక్ చేయడం ఇప్పుడు పాత వార్తగా మారిపోయిందని ఆమె సరదాగా చెప్పారు. తమ మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదని, ఇద్దరూ కేవలం స్నేహితులమేనని అప్పుడే క్లారిటీ ఇచ్చారు.
ఇక బ్రెట్ లీ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే.. 2006లో ఎలిజబెత్ కెంప్‌ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే పెళ్లైన కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో 2008లో విడిపోయారు. 2009లో వీరి విడాకులు అధికారికంగా పూర్తయ్యాయి. ఆ తర్వాత 2014లో బ్రెట్ లీ లానా ఆండర్సన్‌ను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మరోవైపు ప్రితీ జింటా కూడా ప్రస్తుతం పంజాబ్ IPL ఫ్రాంచైజీకి సహ యజమానిగా కొనసాగుతున్నారు. బాలీవుడ్‌లో ఆమె సినిమాలు కొంత తగ్గినా.. ప్రస్తుతం సన్నీ డియోల్‌తో కలిసి Batwara 1947 సినిమాలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. మొత్తానికి.. దాదాపు 20 ఏళ్లుగా వినిపిస్తున్న బ్రెట్ లీ, ప్రితీ జింటా డేటింగ్ రూమర్స్‌పై ఇప్పుడు అసలు నిజం బయటపడింది. వాళ్లిద్దరి మధ్య ఉన్నది ప్రేమ కాదు.. కేవలం మంచి స్నేహం మాత్రమే అని బ్రెట్ లీ క్లారిటీ ఇచ్చాడు.


