పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజామ్‌కు సెంచరీకి చేరువలో ఊహించని షాక్ తగిలింది. వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో 88 పరుగులు చేసిన బాబర్.. దురదృష్టకరమైన రనౌట్‌తో పెవిలియన్‌కు చేరాడు. చాలా రోజుల తర్వాత టెస్ట్ క్రికెట్‌లో సెంచరీ చేయాలని బాబర్ ఎంతో ఆశగా ఎదురుచూశాడు. కానీ సెంచరీకి కేవలం 12 పరుగుల దూరంలో ఉండగానే అతని ఇన్నింగ్స్ అనూహ్యంగా ముగిసిపోయింది. అసలు ఏం జరిగిందంటే.. పాకిస్థాన్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వెస్టిండీస్ బౌలర్లు చాలా టైట్‌గా బౌలింగ్ చేశారు. దీంతో పాకిస్థాన్ బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా మారింది. ఈ సమయంలో బాబర్ అజామ్ బంతిని ఆఫ్ సైడ్ వైపు ఆడాడు. అక్కడ సింగిల్ తీసుకునే అవకాశం కనిపించడంతో, నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న అబ్దుల్లా షఫీక్ కూడా మొదట రన్ కోసం ముందుకు వచ్చాడు. కానీ బంతి ఫీల్డర్ బ్రాండన్ కింగ్ చేతుల్లోకి వెళ్లడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. షఫీక్ వెంటనే బాబర్‌ను వెనక్కి రావాలని సూచించాడు.
అప్పటికే బాబర్ క్రీజు నుంచి చాలా దూరం వచ్చేశాడు. వెంటనే వెనక్కి తిరిగి క్రీజులోకి చేరేందుకు ప్రయత్నించాడు. డైవ్ కూడా చేశాడు. కానీ బ్రాండన్ కింగ్ వేసిన వేగమైన డైరెక్ట్ త్రో నేరుగా వికెట్లను తాకింది. దీంతో బాబర్ అజామ్ రనౌట్ అయ్యాడు. బాబర్ అవుటైన విధానం చూస్తే అతనికే నమ్మశక్యం కాలేదు. రనౌట్ అయిన తర్వాత కొన్ని సెకన్ల పాటు బాబర్ మోకాళ్లపై అలాగే ఉండిపోయాడు. సెంచరీకి ఎంతో దగ్గరగా వచ్చి ఇలా అవుట్ కావడంతో అతని నిరాశ స్పష్టంగా కనిపించింది. బాబర్ అజామ్ చివరిసారిగా టెస్ట్ సెంచరీని 2022 డిసెంబర్‌లో న్యూజిలాండ్‌పై కరాచీ టెస్ట్‌లో చేశాడు. ఆ తర్వాత టెస్ట్ క్రికెట్‌లో మరో సెంచరీ కోసం ఎదురుచూస్తున్న బాబర్‌కు ఈ మ్యాచ్‌లో మంచి అవకాశం వచ్చింది.
కానీ 88 పరుగుల వద్ద జరిగిన ఈ రనౌట్‌తో మరోసారి సెంచరీ మిస్ అయింది. బాబర్ అవుటైన తర్వాత పాకిస్థాన్ బ్యాటింగ్ ఎక్కువసేపు నిలబడలేదు. అబ్దుల్లా షఫీక్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేసి 160 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సాజిద్ ఖాన్ 30 పరుగులు చేశాడు. చివరికి పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌట్ అయింది. అయితే బంతితో సాజిద్ ఖాన్ పాకిస్థాన్‌కు మంచి ఊరటనిచ్చాడు. వెస్టిండీస్ బ్యాటింగ్‌లో నాలుగు వికెట్లు పడగొట్టి ఆ జట్టును తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టాడు. డే 3 ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ 103 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 344 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రస్తుతం పాకిస్థాన్‌పై వెస్టిండీస్‌కు 60 పరుగుల ఆధిక్యం ఉంది. అయితే వెస్టిండీస్ ఆధిక్యం 200 పరుగుల లోపే ఉంటే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచి సిరీస్‌ను సమం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండు టెస్టుల సిరీస్‌లో వెస్టిండీస్ 1-0 ఆధిక్యంలో ఉంది.


