2027 వన్డే వరల్డ్ కప్‌కు ముందు టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్‌లో పెద్ద మార్పు జరగాలా? రోహిత్ శర్మతో కలిసి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ చేయాలా? శుభ్‌మన్ గిల్‌ను నాలుగో స్థానంలో ఆడించాలా? ఇలాంటి ఆసక్తికరమైన సూచన చేశారు మాజీ భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఫరూఖ్ ఇంజినీర్. ఫరూఖ్ ఇంజినీర్ అభిప్రాయం ప్రకారం, వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే వన్డే జట్టులో చోటు దక్కించుకునే స్థాయిలో తన ప్రతిభను నిరూపించాడు. అందుకే అతడిని ఆలస్యం చేయకుండా భారత వన్డే జట్టులోకి తీసుకోవాలని ఆయన అన్నారు. ముఖ్యంగా 2027 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే అతడికి అవకాశాలు ఇవ్వాలని సూచించారు.
ఇంజినీర్ చెప్పిన బ్యాటింగ్ ఆర్డర్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఆయన ప్రకారం రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ ఓపెనర్లుగా బరిలోకి దిగాలి. విరాట్ కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. ప్రస్తుతం ఓపెనర్‌గా ఆడుతున్న శుభ్‌మన్ గిల్‌ను నాలుగో స్థానానికి మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. గిల్ అత్యుత్తమ బ్యాటర్ అని, నాలుగో స్థానంలో కూడా జట్టుకు కీలక ఇన్నింగ్స్ ఆడగలడని చెప్పారు. అలాగే రోహిత్ కుడిచేతి బ్యాటర్ కాగా, వైభవ్ ఎడమచేతి బ్యాటర్ కావడం జట్టుకు మంచి ప్రయోజనం కలిగిస్తుందని ఇంజినీర్ వివరించారు. వన్డేల్లో లెఫ్ట్-రైట్ కాంబినేషన్ ప్రత్యర్థి బౌలర్లపై ఒత్తిడి పెంచుతుందని, అందుకే ఈ జోడీ భారత్‌కు బాగా ఉపయోగపడుతుందని అన్నారు.
వైభవ్ లాంటి దూకుడైన ఆటగాడు ఓపెనర్‌గా వస్తే ఫీల్డింగ్ పరిమితులను బాగా ఉపయోగించుకుని వేగంగా పరుగులు చేయగలడని చెప్పారు. అతను జట్టుకు మంచి ఆరంభం ఇస్తే, తర్వాత వచ్చే కోహ్లీ, గిల్ వంటి బ్యాటర్లు ప్రశాంతంగా ఇన్నింగ్స్‌ను నిర్మించి భారీ స్కోరు సాధించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల జింబాబ్వేతో జరిగిన టీ twenty సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ అద్భుత ప్రదర్శన చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 151 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. రెండు హాఫ్ సెంచరీలు సాధించి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. ఆ సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. ఈ ప్రదర్శనే అతడికి వన్డే జట్టులో అవకాశం ఇవ్వడానికి సరిపోతుందని ఇంజినీర్ అన్నారు.
టీ twenty, వన్డే ఫార్మాట్ల మధ్య అంత పెద్ద తేడా లేదని కూడా ఆయన చెప్పారు. మంచి బంతిని ఎలా ఆడాలో తెలిసిన బ్యాటర్ ఏ ఫార్మాట్‌లోనైనా విజయవంతం అవుతాడని పేర్కొన్నారు. వైభవ్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, ఆత్మవిశ్వాసంతో ఆడుతున్నాడని చెప్పారు. అతడు ఎక్కువ మ్యాచ్‌లు గెలిపిస్తాడే తప్ప, ఓడించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇంగ్లాండ్ పర్యటనలో జరిగిన టీ twenty సిరీస్‌లో వైభవ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. కానీ జింబాబ్వే పర్యటనలో తన ఆటతీరును పూర్తిగా మార్చుకున్నాడు. చివరి టీ twenty లో నెమ్మదైన పిచ్‌పై 49 బంతుల్లో 81 పరుగులు చేసి తనలో పరిస్థితులకు తగ్గట్టుగా ఆడే సామర్థ్యం కూడా ఉందని నిరూపించాడు.
అయినా వైభవ్ ఇంకా కొన్ని విషయాల్లో మెరుగుపడాల్సి ఉందని కూడా తెలుస్తోంది. ముఖ్యంగా షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడం, విదేశీ పరిస్థితులకు త్వరగా అలవాటు పడడం, అవసరానికి తగ్గట్టుగా షాట్ల ఎంపిక చేసుకోవడం వంటి అంశాల్లో అనుభవం పెరగాల్సి ఉంది. అయితే ఈ విషయాల్లో అతడిపై ఎక్కువ ఒత్తిడి పెట్టొద్దని ఫరూఖ్ ఇంజినీర్ సూచించారు. అతని సహజమైన ఆటతీరే అతని పెద్ద బలం అని అన్నారు. ఎక్కువగా కోచింగ్ పేరుతో అతని స్టైల్‌ను మార్చే ప్రయత్నం చేయకూడదని స్పష్టం చేశారు. వైభవ్ ఒక ప్రత్యేకమైన ప్రతిభ కలిగిన ఆటగాడని, వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్ కూడా తనదైన శైలిలో ఆడేవాడని గుర్తు చేశారు. అలాంటి ఆటగాళ్లను వారి సహజ ఆటతోనే ముందుకు వెళ్లనివ్వాలని అన్నారు. మొత్తానికి, 2027 వన్డే వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే వైభవ్ సూర్యవంశీకి అవకాశాలు ఇవ్వాలని ఫరూఖ్ ఇంజినీర్ సూచించారు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేయిస్తే భారత్‌కు మరింత బలమైన బ్యాటింగ్ లైనప్ సిద్ధమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.


