భారత్ – బంగ్లాదేశ్ క్రికెట్ సిరీస్‌పై నెలకొన్న అనిశ్చితి మధ్య బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు తమీమ్ ఇక్బాల్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. 2026 సెప్టెంబర్‌లో జరగాల్సిన ఈ వైట్‌బాల్ సిరీస్‌పై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారం భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడు వన్డేలు, మూడు టీtwenty మ్యాచ్‌లతో కూడిన ఆరు మ్యాచ్‌ల సిరీస్ జరగాల్సి ఉంది. అయితే భద్రతా అంశాలు, ఇతర పరిస్థితుల కారణంగా ఈ పర్యటనపై ఇంకా అధికారిక స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో తమీమ్ ఇక్బాల్ మాట్లాడుతూ, ప్రస్తుతం భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐతో నిరంతరం చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
ఇరు బోర్డుల మధ్య ఈమెయిల్ ద్వారా కూడా చర్చలు జరుగుతున్నాయని, ఈ సిరీస్ తప్పకుండా జరిగేలా బీసీబీ అన్ని విధాలా ప్రయత్నిస్తోందని చెప్పారు. భారత్‌తో సిరీస్ అంటే కేవలం బంగ్లాదేశ్ అభిమానులకే కాదు, జర్నలిస్టులు, క్రికెటర్లు, రెండు దేశాల అభిమానులందరికీ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుందని తమీమ్ పేర్కొన్నారు. భారత్‌తో మ్యాచ్‌లు జరిగితే బంగ్లాదేశ్ క్రికెట్‌కు ఎంతో ప్రాధాన్యం, ఆదరణ లభిస్తుందని ఆయన అన్నారు. గతసారి భారత్ 2022లో బంగ్లాదేశ్ పర్యటించి రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. ఆ తర్వాత ఇరు జట్ల మధ్య మరో ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. తాజా పరిస్థితులపై స్పందించిన తమీమ్ ఇక్బాల్, “బంగ్లాదేశ్ అత్యంత సురక్షిత దేశం. భారత జట్టు తప్పకుండా వస్తుందని నేను చాలా ఆశగా ఎదురుచూస్తున్నాను.
మా వైపు నుంచి తీసుకోవాల్సిన ప్రతి చర్యను మేము తీసుకుంటున్నాం” అని స్పష్టం చేశారు. అయితే కొన్ని విషయాలు తన పరిధిలో లేవని కూడా ఆయన అంగీకరించారు. బీసీబీ అధ్యక్షుడిగా తన బాధ్యతల పరిధిలో చేయగలిగిన ప్రతిదీ చేస్తున్నానని, కానీ కొన్ని నిర్ణయాలు పూర్తిగా తన చేతుల్లో ఉండవని చెప్పారు. భారత్‌తో సిరీస్ వల్ల కలిగే ప్రయోజనాలను కూడా బీసీసీఐ అధికారులకు వివరిస్తున్నామని, ఇప్పటివరకు జరిగిన అన్ని చర్చలు చాలా సానుకూలంగా సాగాయని ఆయన వెల్లడించారు. తుది నిర్ణయం మాత్రం భారత క్రికెట్ బోర్డు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.
“త్వరలోనే ఈ సిరీస్ జరుగుతుందా లేదా అన్న విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అందరూ మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే” అని తమీమ్ ఇక్బాల్ చెప్పారు. ఈ సిరీస్‌కు సంబంధించి గతంలో భద్రతా అంశాలు పెద్ద చర్చగా మారాయి. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని గత ప్రభుత్వ కాలంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ బంగ్లాదేశ్‌లో జరగాల్సిన టీtwenty ప్రపంచకప్‌కు వెళ్లకూడదని నిర్ణయించింది. దీంతో ఇరు దేశాల మధ్య భవిష్యత్ క్రికెట్ సంబంధాలపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇటీవల ప్రాంతీయ పరిస్థితుల్లో వచ్చిన మార్పులు, ఇరు దేశాల క్రికెట్ బోర్డుల మధ్య కొనసాగుతున్న సానుకూల చర్చలు ఈ పర్యటన జరిగే అవకాశాలను మళ్లీ పెంచుతున్నాయి. ఇప్పుడు క్రికెట్ అభిమానులందరి దృష్టి ఒక్క విషయంపైనే ఉంది. నిజంగానే భారత్ సెప్టెంబర్ 2026లో బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తుందా? లేక ఈ సిరీస్ మరోసారి వాయిదా పడుతుందా? దీనిపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


