Top 5 This Week

Related Posts

రాహుల్ ద్రావిడ్ 2.0 వచ్చేశాడా? సమిత్ ద్రావిడ్ బ్యాటింగ్ చూసి షాక్ అయిన ఫ్యాన్స్

భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్‌ను మరోసారి మైదానంలో చూసినట్టుగా అభిమానులు ఫీల్ అయ్యారు. అయితే బ్యాటింగ్ చేసింది రాహుల్ ద్రావిడ్ కాదు… ఆయన పెద్ద కుమారుడు  సమిత్ ద్రావిడ్.

మహారాజా ట్రోఫీ కేఎస్‌సీఏ టీ twenty 2026 టోర్నీలో కళ్యాణి బెంగళూరు బ్లాస్టర్స్ తరఫున సమిత్ బ్యాటింగ్‌కు వచ్చిన క్షణం నుంచే సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఆయన క్రీజ్‌లో నిలబడిన తీరు, బ్యాట్ ఎత్తే విధానం, ఎడమ మోచేతి పొజిషన్, ఫుట్‌వర్క్, షాట్లు… అన్నీ అచ్చం రాహుల్ ద్రావిడ్‌ను గుర్తు చేశాయి. దీంతో అభిమానులు “ది వాల్ మళ్లీ వచ్చేశాడు”, “రాహుల్ ద్రావిడ్ 2.0” అంటూ కామెంట్లు చేయడం ప్రారంభించారు.

ఈ మ్యాచ్‌లో బెంగళూరు బ్లాస్టర్స్ కేవలం ఎనిమిది బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అలాంటి సమయంలో క్రీజ్‌లోకి వచ్చిన సమిత్ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా బ్యాటింగ్ చేశాడు.

కేవలం 23 బంతుల్లో 32 పరుగులు చేసి జట్టును గాడిలో పెట్టాడు. తన ఇన్నింగ్స్‌లో ఆరు అద్భుతమైన ఫోర్లు బాదాడు. ముఖ్యంగా స్క్వేర్ కట్స్, కవర్ డ్రైవ్స్, పుల్ షాట్లు, డిఫెన్స్ చూసిన అభిమానులు రాహుల్ ద్రావిడ్ ఆటను గుర్తు చేసుకున్నారు.

సమిత్ అవుట్ అయిన తర్వాత రోహన్ పాటిల్ 64 పరుగులు, ప్రవీణ్ దూబే 51 పరుగులతో చెలరేగడంతో బెంగళూరు బ్లాస్టర్స్ 20 ఓవర్లలో 203 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనలో హుబ్లీ టైగర్స్ తరఫున మన్‌వంత్ కుమార్ 60 పరుగులతో అద్భుతంగా పోరాడినా, చివరికి రెండు పరుగుల తేడాతో మ్యాచ్‌ను కోల్పోయింది.

అయితే ఈ మ్యాచ్‌లో స్కోరు కంటే ఎక్కువగా చర్చకు వచ్చిన అంశం సమిత్ ద్రావిడ్ బ్యాటింగ్ స్టైల్.

చిన్నప్పటి నుంచే రాహుల్ ద్రావిడ్ మార్గదర్శకత్వంలో పెరిగిన సమిత్‌కు ఆ టెక్నిక్ రావడం ఆశ్చర్యం కాదు. కానీ ఒక ముఖ్యమైన విషయము ఏమిటంటే… సమిత్ తన తండ్రిలా కేవలం బ్యాట్స్‌మన్ మాత్రమే కాదు.

అతను ఒక ప్రతిభావంతమైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కూడా.2023-24 కూచ్ బెహార్ ట్రోఫీలో కర్ణాటక జట్టును విజేతగా నిలపడంలో సమిత్ కీలక పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో 362 పరుగులు చేయడంతో పాటు 16 వికెట్లు కూడా తీశాడు. జమ్మూ కశ్మీర్‌పై 98 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని ఆకర్షించాడు.

ఆ ప్రదర్శనతో 2024 లో ఆస్ట్రేలియాతో జరిగిన అండర్ 19 సిరీస్‌కు భారత జట్టులో ఎంపికయ్యాడు. అయితే దురదృష్టవశాత్తూ మోకాలి గాయం కారణంగా ఆ అవకాశాన్ని కోల్పోయాడు.గాయం నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శనలు చేస్తూ తన సత్తా చాటుతున్నాడు.ఇక ద్రావిడ్ కుటుంబంలో మరో యువ క్రికెటర్ కూడా వెలుగులోకి వస్తున్నాడు. రాహుల్ ద్రావిడ్ చిన్న కుమారుడు  అన్వయ్ ద్రావిడ్  కూడా భారత అండర్-19 జట్టులో చోటు సంపాదించాడు.

వికెట్ కీపర్ బ్యాటర్‌గా రాణిస్తున్న అన్వయ్, ఇటీవల శ్రీలంక పర్యటనకు వెళ్లే భారత అండర్ 19 జట్టుకు ఎంపికయ్యాడు. వినూ మాంకడ్ ట్రోఫీలో కర్ణాటక అండర్ 19  జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించి 220 పరుగులు చేశాడు. అందులో ఓ అజేయమైన 82 పరుగుల ఇన్నింగ్స్ కూడా ఉంది.

దీంతో రాహుల్ ద్రావిడ్ తర్వాత ఆయన ఇద్దరు కుమారులు కూడా భారత క్రికెట్‌లో తమదైన ముద్ర వేయడానికి సిద్ధమవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles