అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ టీమిండియా బ్యాటర్ అజింక్య రహానే.. తాజాగా అభిమానులకు ఎమోషనల్ మెసేజ్ చేశాడు. తన రిటైర్మెంట్ ప్రకటన తర్వాత అభిమానుల నుంచి వచ్చిన ప్రేమ, సందేశాలకు రహానే ధన్యవాదాలు తెలిపాడు. దశాబ్దానికి పైగా సాగిన తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణానికి ముగింపు పలికిన రహానే.. తన రిటైర్మెంట్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానుల నుంచి ఎన్నో మెసేజ్‌లు వచ్చినట్లు చెప్పాడు. “మీ మెసేజ్‌లు, శుభాకాంక్షలు, మద్దతుకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు చూపించిన ప్రేమతో నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. ఈ ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను” అని రహానే సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. రహానే రిటైర్మెంట్ ప్రకటన తర్వాత ప్రపంచ క్రికెట్‌లోని పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యంగా మాజీ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రహానేను ప్రత్యేకంగా ప్రశంసించాడు.
టెస్ట్ క్రికెట్‌లో తనకు ఇష్టమైన బ్యాటింగ్ భాగస్వామి రహానేనే అని కోహ్లీ చెప్పాడు. భారత క్రికెట్‌కు రహానే ఎంతో సేవ చేశాడని, తన కెరీర్ గురించి గర్వపడాలని అన్నాడు. అలాగే స్లిప్స్‌లో రహానే అత్యంత నమ్మకమైన ఫీల్డర్ అని కోహ్లీ ప్రశంసించాడు. టెస్టుల్లో కోహ్లీ, రహానే కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. వీరిద్దరూ కలిసి 10 సెంచరీ భాగస్వామ్యాలు, 19 యాభైకి పైగా పరుగుల భాగస్వామ్యాలు నమోదు చేశారు. న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరూ 365 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ మ్యాచ్‌లో కోహ్లీ 211 పరుగులు చేయగా, రహానే తన కెరీర్‌లోనే అత్యుత్తమమైన 188 పరుగులు చేశాడు. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా రహానే కెరీర్‌ను గుర్తు చేసుకున్నాడు.
దేశవాళీ క్రికెట్‌లో ముంబై తరఫున తొలిసారి రహానేతో కలిసి బ్యాటింగ్ చేసిన సందర్భాన్ని సచిన్ గుర్తుచేశాడు. రహానే ఎప్పుడూ ప్రత్యేక సందర్భాల కోసం ఎదురుచూడలేదని, జట్టు కోసం కష్టపడేందుకు సిద్ధంగా ఉండేవాడని సచిన్ చెప్పాడు. అదే లక్షణం ఆస్ట్రేలియాలో అతని అత్యుత్తమ ప్రదర్శనకు కారణమైందని ప్రశంసించాడు. రహానే 2011 నుంచి 2023 వరకు భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ twenty లు ఆడాడు. టెస్టుల్లో 5,077 పరుగులు, వన్డేల్లో 2,962 పరుగులు, టీ twenty ల్లో 375 పరుగులు చేశాడు. అయితే రహానే కెరీర్‌లో అత్యంత ప్రత్యేకమైన ఘట్టం 2020-21 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. అడిలైడ్ టెస్ట్ తర్వాత విరాట్ కోహ్లీ భారత్‌కు తిరిగి రావడంతో రహానే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
అనేక మంది కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకు దూరమైన సమయంలో రహానే భారత జట్టును అద్భుతంగా నడిపించాడు. మెల్‌బోర్న్ టెస్టులో అతను అద్భుతమైన సెంచరీ చేసి భారత్ విజయానికి బలమైన పునాది వేశాడు. ఆ తర్వాత గబ్బా టెస్టులో చారిత్రాత్మక విజయం సాధించి, భారత్ ఆ సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఇది భారత క్రికెట్ చరిత్రలో అత్యంత గొప్ప విదేశీ టెస్ట్ సిరీస్ విజయాల్లో ఒకటిగా నిలిచింది. మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా రహానేను అత్యంత అండర్‌రేటెడ్ క్రికెటర్లలో ఒకరిగా అభివర్ణించాడు. భారతదేశం సాధించిన గొప్ప విదేశీ టెస్ట్ సిరీస్ విజయానికి రహానే నాయకత్వం వహించాడని ప్రశంసించాడు. చేతేశ్వర్ పుజారా, శిఖర్ ధావన్, పీవీ సింధు, ఇర్ఫాన్ పఠాన్, బీసీసీఐ, ముంబై క్రికెట్ అసోసియేషన్ కూడా రహానేకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ప్రశాంతమైన స్వభావం, వినయం, జట్టు కోసం ఎప్పుడూ కష్టపడే తత్వాన్ని అందరూ గుర్తు చేసుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రహానేకు అభిమానులు కూడా భారీగా మద్దతు ఇస్తున్నారు. తనకు వచ్చిన ఈ ప్రేమను ఎప్పటికీ గుర్తుంచుకుంటానని రహానే చెప్పాడు.


