Top 5 This Week

Related Posts

యువరాజ్ సింగ్‌కు కొత్త బాధ్యత? ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా ఎంట్రీ! 

భారత క్రికెట్‌లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకోబోతోంది. టీమిండియా మాజీ స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ త్వరలో కోచ్‌గా, కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వచ్చే ఐపీఎల్ సీజన్‌లో యువరాజ్ సింగ్ దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్న దిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జట్టులో పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది.ఈ ఏడాది ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్ 14 పాయింట్లు సాధించినప్పటికీ, ఆరో స్థానానికే పరిమితమైంది. అంతేకాదు, వరుసగా రెండు సీజన్లుగా ప్లేఆఫ్స్‌కు చేరుకోలేకపోయింది. దీంతో జట్టును మరింత బలంగా తయారు చేయాలని యాజమాన్యం భావిస్తోంది.

ఈ నేపథ్యంలో కోచింగ్ సిబ్బందిలో కూడా మార్పులు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వేణుగోపాల్ రావు, హేమాంగ్ బదాని, మునాఫ్ పటేల్‌లను తప్పించే అవకాశం ఉందని సమాచారం. వారి స్థానంలో యువరాజ్ సింగ్‌కు కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.యువరాజ్ సింగ్ పేరు వినగానే అభిమానులకు ఎన్నో అద్భుత విజయాలు గుర్తుకు వస్తాయి. 2007 టీ twenty  ప్రపంచకప్‌లోనూ, 2011 వన్డే ప్రపంచకప్‌లోనూ భారత జట్టు విజయంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా 2011 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డును సొంతం చేసుకున్నాడు.

ఐపీఎల్‌లో కూడా యువరాజ్ సింగ్ 132 మ్యాచ్‌లు ఆడాడు. తన దూకుడు బ్యాటింగ్‌తో ఎన్నో మ్యాచ్‌ల్లో అభిమానులను అలరించాడు. చివరకు 2019 లో అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇప్పుడు మళ్లీ కోచ్ రూపంలో క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు.యువరాజ్ సింగ్ కేవలం మాజీ ఆటగాడే కాదు, యువ క్రికెటర్లకు మంచి మార్గదర్శిగా కూడా పేరు సంపాదించాడు. ప్రస్తుత భారత టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఎదుగుదలలో యువరాజ్ సింగ్ పాత్ర ఎంతో కీలకమని చెబుతుంటారు.

అలాగే ప్రపంచ నంబర్ వన్ టీ twenty బ్యాటర్ అభిషేక్ శర్మకు కూడా యువరాజ్ వ్యక్తిగత మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. వీరిద్దరూ తమ ఆటను మెరుగుపరుచుకోవడంలో యువరాజ్ సూచనలు ఎంతగానో ఉపయోగపడ్డాయని పలుమార్లు చెప్పారు.ఇక స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ కూడా తన కెరీర్‌లో కష్టకాలం ఎదుర్కొన్న సమయంలో యువరాజ్ సింగ్ సలహాలు తీసుకున్నాడు. దీంతో యువరాజ్ మార్గదర్శకత్వంలో చాలామంది యువ ఆటగాళ్లు మంచి స్థాయికి చేరుకున్నారు.అందుకే ఇప్పుడు దిల్లీ క్యాపిటల్స్ జట్టుకు యువరాజ్ సింగ్ లాంటి అనుభవజ్ఞుడు బ్యాటింగ్ కోచ్‌గా వస్తే జట్టుకు ఎంతో ఉపయోగం ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు.

మరోవైపు దిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్ పదవికి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. గంగూలీ మళ్లీ దిల్లీ జట్టుతో కలిస్తే జట్టుకు మరింత బలం చేకూరే అవకాశం ఉందని భావిస్తున్నారు.ఇక రిషబ్ పంత్ విషయంలో కూడా ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లఖ్‌నవూ జట్టులో ఉన్న పంత్‌ను తిరిగి తమ జట్టులోకి తీసుకురావాలని దిల్లీ క్యాపిటల్స్ ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.ఈ సీజన్‌లో లఖ్‌నవూ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. జట్టు పేలవ ప్రదర్శన కారణంగా రిషబ్ పంత్ కెప్టెన్సీని కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే. దీంతో అతడు లఖ్‌నవూ జట్టును వీడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఒకవేళ రిషబ్ పంత్ మళ్లీ దిల్లీ క్యాపిటల్స్‌లోకి వస్తే, యువరాజ్ సింగ్ లాంటి లెజెండ్ కోచ్‌గా ఉండడం అతడికి మరింత ఉపయోగపడే అవకాశం ఉంది. అదే సమయంలో సౌరభ్ గంగూలీ కూడా కీలక బాధ్యతలు చేపడితే దిల్లీ క్యాపిటల్స్ పూర్తిగా కొత్త రూపంలో కనిపించే అవకాశం ఉంది.మరి యువరాజ్ సింగ్ నిజంగానే దిల్లీ క్యాపిటల్స్ బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపడతాడా? రిషబ్ పంత్ మళ్లీ తన పాత జట్టులోకి చేరతాడా? ఈ మార్పులు దిల్లీ జట్టు అదృష్టాన్ని మార్చుతాయా? అనేది వచ్చే ఐపీఎల్ సీజన్‌లో ఆసక్తికరంగా మారనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles