క్రికెట్ చరిత్రలో ఓ కొత్త అధ్యాయానికి తెరలేచింది. ఇప్పటివరకు కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే నిర్వహించిన బిగ్ బాష్ లీగ్ ఇప్పుడు తొలిసారి భారత గడ్డపై అడుగుపెట్టబోతోంది. ఈ సంచలన ప్రకటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కలిసి అధికారికంగా ప్రకటించారు. 2026 – 27 బిగ్ బాష్ లీగ్ సీజన్ ప్రారంభ మ్యాచ్ డిసెంబర్ 12న చెన్నైలోని ప్రముఖ ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్టు, పెర్త్ స్కార్చర్స్ జట్టుతో తలపడనుంది. బిగ్ బాష్ చరిత్రలో విదేశీ గడ్డపై నిర్వహించే తొలి మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ ప్రకటనను ఆస్ట్రేలియాలోని చారిత్రాత్మక మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో చేశారు.
భారత్-ఆస్ట్రేలియా మధ్య క్రీడా, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి చేపట్టిన ‘G’day Namaste’కార్యక్రమంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మ్యాచ్‌పై ఇప్పటికే భారత క్రికెట్ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా చెన్నైలో బిగ్ బాష్ మ్యాచ్ జరగడం పట్ల అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా క్రికెట్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్స్ ఎగ్జిక్యూటివ్ జనరల్ మేనేజర్ అలిస్టేర్ డాబ్సన్ మాట్లాడుతూ… “భారత్‌లో, ముఖ్యంగా చెన్నైలో క్రికెట్ అభిమానుల ఉత్సాహం అసాధారణం. మేము మాట్లాడిన ప్రతి ఒక్కరూ ఈ మ్యాచ్‌కు భారీ సంఖ్యలో అభిమానులు వస్తారని నమ్మకం వ్యక్తం చేశారు” అని తెలిపారు.
అంతేకాకుండా, “ఐపీఎల్‌కు ఉన్న ఆదరణతో పోల్చలేం కానీ భారత్‌లో బిగ్ బాష్ లీగ్‌కూ మంచి గుర్తింపు ఉంది. భారత అభిమానుల మధ్య ఈ లీగ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. స్టేడియం ప్రేక్షకులతో నిండిపోతుందని మేము విశ్వసిస్తున్నాం” అని ఆయన అన్నారు. ఈ మ్యాచ్ అధికారికంగా మెల్‌బోర్న్ రెనిగేడ్స్ జట్టు హోమ్ మ్యాచ్‌గా పరిగణించబడుతుంది. అయితే భారత్‌లో మ్యాచ్ నిర్వహిస్తున్నందున రెండు జట్లకూ ఆ తర్వాత ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్లేందుకు అదనపు సమయం కేటాయించనున్నారు. దీంతో వారి తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్‌పై ఎలాంటి ప్రభావం ఉండదని నిర్వాహకులు తెలిపారు. ఇక పూర్తి బిగ్ బాష్ లీగ్ షెడ్యూల్‌ను వచ్చే వారం విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ ప్రత్యేక మ్యాచ్‌కు పలు ఫ్రాంచైజీలు ఆసక్తి చూపినప్పటికీ, ప్రయాణాలు మరియు బిజీ షెడ్యూల్ కారణంగా కొన్ని జట్లు పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. అలిస్టేర్ డాబ్సన్ మాట్లాడుతూ… “జట్ల ప్రయాణం, వాణిజ్య అంశాలు, షెడ్యూల్ వంటి అనేక విషయాలను పరిశీలించిన తర్వాతే ఈ రెండు జట్లను ఎంపిక చేశాం. లీగ్ సజావుగా సాగడంతో పాటు ఈ ప్రత్యేక మ్యాచ్ కూడా విజయవంతం కావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం” అని వివరించారు.
మొత్తానికి, బిగ్ బాష్ లీగ్ చరిత్రలో తొలిసారి విదేశాల్లో మ్యాచ్ నిర్వహించబడుతుండటం క్రికెట్ ప్రపంచానికి ఒక మైలురాయిగా నిలవనుంది. చెన్నై వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారత్-ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాలను మరింత బలోపేతం చేయడమే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులకు ఒక ప్రత్యేక అనుభూతిని అందించనుంది.


