టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కెరీర్‌కు సంబంధించి ఇప్పుడు సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. లార్డ్స్‌లో జరగబోయే మూడో వన్డే రోహిత్ శర్మకు భారత జట్టు తరఫున చివరి మ్యాచ్ కావొచ్చనే వార్తలు భారత క్రికెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. ఇంగ్లండ్‌తో కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 47 బంతుల్లో కేవలం 26 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అతని ఇన్నింగ్స్‌లో ఆత్మవిశ్వాసం, దూకుడు కనిపించలేదు. దీంతో అతని భవిష్యత్తుపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, ఈ సిరీస్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ ఇకపై టీమిండియా తొలి ఎంపిక ఓపెనర్‌గా ఉండకపోవచ్చని సెలక్షన్ కమిటీ నిర్ణయించినట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో లార్డ్స్‌లో జరిగే మూడో వన్డేనే రోహిత్‌కు చివరి అంతర్జాతీయ మ్యాచ్ అయ్యే అవకాశం ఉందని వార్తలు చెబుతున్నాయి. ఈ నిర్ణయం ఒక్క మ్యాచ్ ఆధారంగా తీసుకోలేదని తెలుస్తోంది. గత కొంతకాలంగా రోహిత్ ఫామ్, ఫిట్‌నెస్, అలాగే 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని సెలెక్టర్లు ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
ఇదే సమయంలో మరో యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్కు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. 2027లో దక్షిణాఫ్రికాలో జరిగే ప్రపంచకప్ నాటికి యువ ఆటగాళ్లను పూర్తిగా సిద్ధం చేయాలన్నదే వారి లక్ష్యమని తెలుస్తోంది. వాస్తవానికి ఇంగ్లండ్ సిరీస్ మొత్తాన్ని జైస్వాల్‌తో ఆడించాలని మేనేజ్‌మెంట్ అనుకున్నప్పటికీ, రోహిత్‌కు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. కానీ రెండో వన్డేలో కూడా రోహిత్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందని సమాచారం. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం, సెలెక్టర్లు తమ అభిప్రాయాన్ని ఇప్పటికే బోర్డుకు తెలియజేశారు. ఇప్పుడు రోహిత్‌తో బోర్డు అధికారులు మాట్లాడతారా? లేక సెలెక్టర్లే నేరుగా చర్చిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇది మొదటిసారి కాదు. గత నెల అఫ్గానిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్ తర్వాతే రోహిత్‌ను తప్పించాలని సెలెక్టర్లు భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ సమయంలో కూడా రోహిత్ విశ్రాంతి తీసుకోవడానికి అంగీకరించలేదు. దీంతో యశస్వి జైస్వాల్‌కు అవకాశం కల్పించేందుకు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందని సమాచారం. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత వన్డే కెప్టెన్సీని శుభ్‌మన్ గిల్‌కు అప్పగించినప్పటి నుంచి రోహిత్ ప్రదర్శనలతో టీమ్ మేనేజ్‌మెంట్ పూర్తిగా సంతృప్తిగా లేదని కూడా నివేదికలు చెబుతున్నాయి. రోహిత్ బ్యాటింగ్ శైలిలో కూడా పెద్ద మార్పు వచ్చిందని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో తొలి బంతి నుంచే దూకుడుగా ఆడే రోహిత్, ఇప్పుడు చాలా నెమ్మదిగా ఆడుతున్నాడు.
ఒక సిరీస్‌లో లయ అందుకోవడానికి కనీసం మూడు మ్యాచ్‌లు పడుతున్నాయని మేనేజ్‌మెంట్ అభిప్రాయపడుతోంది. ఇంకో ముఖ్యమైన విషయము ఏమిటంటే… టెస్టులు, టీట్వంటీ లకు వీడ్కోలు చెప్పిన తర్వాత రోహిత్ చాలా తక్కువ క్రికెట్ ఆడుతున్నాడు. గత సీజన్ విజయ్ హజారే ట్రోఫీలో కేవలం రెండు మ్యాచ్‌లే ఆడాడు. అందువల్ల మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం కూడా అతని ఫామ్‌పై ప్రభావం చూపిందని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు బీసీసీఐ నుంచి కానీ, రోహిత్ శర్మ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కాబట్టి ఇవన్నీ ప్రస్తుతం మీడియాలో వస్తున్న కథనాలు మాత్రమే. తుది నిర్ణయం మాత్రం బీసీసీఐ, సెలెక్టర్లు మరియు రోహిత్ శర్మ మధ్య జరిగే చర్చల తర్వాతే తెలుస్తుంది.


