ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 1 – 1 తో సమం చేసింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఓటమికి అసలు కారణమేంటో గిల్ ఎలాంటి మొహమాటం లేకుండా చెప్పేశాడు. ముందుగా మ్యాచ్ విషయానికి వస్తే… కార్డిఫ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 233 పరుగులకు ఆలౌట్ అయింది.
విరాట్ కోహ్లీ 65 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 66 పరుగులతో అర్ధ సెంచరీలు సాధించారు. ఒక దశలో భారత్ 178 పరుగులకు మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 300కు పైగా స్కోర్ చేస్తుందని అందరూ భావించారు. కానీ ఒక్కసారిగా మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. కేవలం 26 బంతుల వ్యవధిలోనే భారత్ నాలుగు కీలక వికెట్లు కోల్పోయి 193 పరుగులకు ఏడు వికెట్లతో కష్టాల్లో పడింది. మిడిల్ ఆర్డర్ వరుసగా విఫలం కావడంతో భారీ స్కోర్ చేసే అవకాశం చేతులారా జారిపోయింది. చివరకు భారత్ 233 పరుగులకే పరిమితమైంది. 234 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కూడా ఆరంభంలో ఒత్తిడిని ఎదుర్కొంది. కానీ అనుభవజ్ఞుడు జో రూట్ మరోసారి తన క్లాస్ చూపించాడు.
అద్భుతంగా ఇన్నింగ్స్‌ను నిర్మిస్తూ 99 పరుగులతో అజేయంగా నిలిచి ఇంగ్లండ్‌ను 44.1 ఓవర్లలో విజయతీరాలకు చేర్చాడు. ఈ ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కూడా అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడిన శుభ్‌మన్ గిల్, “25 ఓవర్ల తర్వాత మేము 300 నుంచి 310 పరుగులు చేస్తామని భావించాం. కానీ మధ్య ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్‌పై మా పట్టు సడలిపోయింది” అని చెప్పాడు. అంతేకాదు, దిగువ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ల నుంచి మరింత బాధ్యతాయుతమైన ఆటను ఆశించామని కూడా గిల్ స్పష్టం చేశాడు.
“మా టెయిల్ ఎండర్లు పెద్ద బ్యాటర్లు కాకపోయినా, లోయర్ మిడిల్ ఆర్డర్ మాత్రం మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మార్చాల్సింది. కానీ వారు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. వాళ్ల నుంచి ఇంకా ఎక్కువ ఆశించాం” అని గిల్ పేర్కొన్నాడు. వాషింగ్టన్ సుందర్ గాయం కూడా జట్టుపై ప్రభావం చూపిందని గిల్ వెల్లడించాడు. “వాషింగ్టన్ సుందర్ మా జట్టులో చాలా కీలక ఆటగాడు. అతను గాయపడటంతో ఒక ముఖ్యమైన బౌలింగ్ ఆప్షన్‌ను కోల్పోయాం. అది మ్యాచ్‌లో కొంత తేడా తీసుకొచ్చింది. అయినప్పటికీ ఈ పిచ్‌పై ఫాస్ట్ బౌలర్లకే ఎక్కువ సహకారం లభించింది. కానీ కీలక ఆటగాడు దూరమైతే జట్టు మొమెంటమ్ దెబ్బతింటుంది” అని గిల్ చెప్పాడు. ఇక జో రూట్ గురించి కూడా గిల్ ప్రశంసలు కురిపించాడు.
“ఇలాంటి లక్ష్యాలను ఛేదించడంలో జో రూట్ మాస్టర్. రన్‌రేట్ ఐదుకు మించి ఉంటే అతనిపై ఒత్తిడి తీసుకురాగలిగేవాళ్లం. కానీ ఈ తరహా టార్గెట్ అతనికి బాగా సరిపోయింది. ఒక్క అవకాశం కూడా ఇవ్వకుండా ఇన్నింగ్స్‌ను అద్భుతంగా నిర్మించాడు” అని గిల్ అన్నాడు. మరోవైపు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ జో రూట్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత తిరిగి గెలవడం చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు సిరీస్ 1-1తో సమమైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చివరి వరకు నిలబడి జట్టును గెలిపించడమే అసలైన సంతృప్తి” అని రూట్ తెలిపాడు. పిచ్‌పై బ్యాటింగ్ అంత ఈజీ కాదని, భాగస్వామ్యాలే విజయానికి కారణమయ్యాయని చెప్పాడు. “కొన్ని సందర్భాల్లో అందంగా కాకపోయినా పోరాడి గెలవాలి. అదే మంచి జట్ల లక్షణం.
మేము అదే చేశాం” అని రూట్ పేర్కొన్నాడు. ఇటీవల వన్డేల్లో ఇంగ్లండ్ ప్రదర్శనపై వచ్చిన విమర్శలకు కూడా రూట్ సమాధానం ఇచ్చాడు. “ప్రపంచ నంబర్ వన్ జట్టును ఓడించడం గొప్ప విషయము . మా జట్టు గురించి బయట ఉన్న అభిప్రాయం కంటే మేము చాలా మెరుగ్గా ఉన్నాం. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి బలంగా రావడం మా ప్రత్యేకత” అని రూట్ ధీమా వ్యక్తం చేశాడు. ఇప్పుడు మూడు మ్యాచ్‌ల సిరీస్ 1 – 1తో సమమైంది. దీంతో లార్డ్స్ వేదికగా జరగబోయే మూడో వన్డే ఫైనల్‌లా మారింది. ఆ మ్యాచ్‌లో గెలిచిన జట్టే సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది.


