భారత క్రికెట్లో వరుసగా ఆటగాళ్లు గాయపడుతుండటం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తోంది. అసలు ఆటగాళ్లకు ఇన్ని గాయాలు ఎందుకు అవుతున్నాయి? దీనికి కారణం ఎక్కువగా మ్యాచ్‌లు ఆడటమేనా? లేక ఆటగాళ్ల workload విషయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదా? ఇలాంటి ప్రశ్నలకు భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. శనివారం నుంచి శ్రీలంకతో భారత్ కీలకమైన రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు టీమిండియాలోని రెగ్యులర్ ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అందుబాటులో లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బుమ్రా, సాయి సుదర్శన్ ఇద్దరూ మొదట జట్టులో ఎంపికయ్యారు. కానీ ఆ తర్వాత ఫిట్నెస్ కారణాలతో వారిని జట్టు నుంచి తప్పించారు. వీరి availability ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంటుందని BCCI ముందే చెప్పింది. అయినప్పటికీ, వాళ్లు ఇంకా దూరంగా ఉండటంతో Centre of Excellence లో ఆటగాళ్లకు ఇస్తున్న fitness, workload protocols పై ప్రశ్నలు వస్తున్నాయి. ఈ అంశంపై కపిల్ దేవ్ మాట్లాడుతూ.. ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడటం చాలా ముఖ్యమని చెప్పారు. అంతేకాదు.. ప్రతి ఆటగాడు తన శరీరం గురించి తెలుసుకోవాలని సూచించారు. ప్రస్తుతం T20 క్రికెట్ చాలా ఎక్కువగా జరుగుతోందని, దాని ప్రభావం ఆటగాళ్ల శరీరంపై పడుతుందని కపిల్ దేవ్ అన్నారు.ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ల విషయంలో మరింత జాగ్రత్త అవసరమని చెప్పారు.
ఫాస్ట్ బౌలింగ్ చేయడానికి మన శరీరం సహజంగా పూర్తిగా సరిపోయేలా ఉండదని.. మన శరీరం బ్యాటింగ్‌కు ఎక్కువగా అనుకూలంగా ఉంటుందని కపిల్ దేవ్ అభిప్రాయపడ్డారు. అందుకే ఒక ఫాస్ట్ బౌలర్‌కు ఎంత workload ఇవ్వాలి? ఎన్ని మ్యాచ్‌లు ఆడించాలి? అనే విషయాలను BCCI ప్రత్యేకంగా పరిశీలించాలని కపిల్ దేవ్ సూచించారు. ఇక మరో ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి విషయంలో కూడా ఆందోళనలు పెరుగుతున్నాయి. వరుసగా గాయాల సమస్యలను ఎదుర్కొంటున్న నితీష్.. IPL లో తన బౌలింగ్ వేగాన్ని పెంచుకునే ప్రయత్నంలో క్వాడ్రిసెప్స్ గాయానికి గురయ్యాడు.
ఇక భారత జట్టు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంపై కూడా కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో భారత్ వైట్‌వాష్ కావడంతో.. స్పిన్‌ను ఎదుర్కోవడంలో టీమిండియా బలహీనతపై చర్చ జరుగుతోంది. దీనికి ప్రధాన కారణం టాప్ ప్లేయర్లు తగినంతగా దేశవాళీ క్రికెట్ ఆడకపోవడమేనని కపిల్ దేవ్ అన్నారు. BCCI ఈ విషయంలో కఠినంగా వ్యవహరించి.. అందరూ మల్టీ-డే దేశవాళీ మ్యాచ్‌లు ఆడేలా చూడాలని సూచించారు. దీంతో యువ ఆటగాళ్లకు కూడా టాప్ ప్లేయర్ల నుంచి నేర్చుకునే అవకాశం వస్తుందని కపిల్ దేవ్ చెప్పారు.
అలాగే భారత ఆటగాళ్లు ప్రస్తుతం ఎక్కువగా T20 లు, వన్డేలు ఆడుతున్నారని.. టెస్ట్ క్రికెట్ మాత్రం పూర్తిగా భిన్నమైన ఆట అని ఆయన గుర్తు చేశారు. ఇటీవల స్పిన్ బౌలింగ్‌పై భారత్ అత్యుత్తమ ప్రదర్శన చేయలేకపోయిందని చెబుతూ.. ఆటగాళ్లు అందరూ కలిసి దీనిపై ఆలోచించి సరైన పరిష్కారం కనుగొనాలని కపిల్ దేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మరి కపిల్ దేవ్ సూచించినట్టుగా BCCI workload విషయంలో కొత్త నిర్ణయాలు తీసుకుంటుందా? భారత ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ ఎక్కువగా ఆడతారా? చూడాలి. ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!


