Top 5 This Week

Related Posts

నా లక్ష్యం ఒక్కటే.. టాప్‌లో ఉండాలి, పరుగులు చేయాలి: స్మరణ్

దేశవాళీ క్రికెట్‌లో వరుసగా రెండు సీజన్లలో అదరగొట్టి.. ఇప్పుడు టీమిండియా ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న యువ బ్యాటర్ స్మరణ్ రవిచంద్రన్. గత రెండు, రంజీ ట్రోఫీ సీజన్లలో స్మరణ్ 26 ఇన్నింగ్స్‌ల్లో 1534 పరుగులు చేశాడు. ఇందులో ఏకంగా మూడు డబుల్ సెంచరీలు ఉన్నాయి. అతని బ్యాటింగ్ యావరేజ్ కూడా 73.60. అంతేకాదు.. విజయ్ హజారే ట్రోఫీలో కర్ణాటక టైటిల్ గెలవడంలో స్మరణ్ కీలక పాత్ర పోషించాడు. 7 ఇన్నింగ్స్‌ల్లో 433 పరుగులు, రెండు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా 319 పరుగులతో కర్ణాటక తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అందుకే స్మరణ్ ఇప్పుడు దేశవాళీ క్రికెట్‌లో వన్ సీజన్ వండర్ కాదు.. వరుసగా సత్తా చాటుతున్న ఆటగాడు అని నిరూపించుకున్నాడు.

అయితే స్మరణ్‌కు అసలు టార్గెట్ మాత్రం టీమిండియా. ఇటీవల ఇండియా, A జట్టులో చోటు దక్కకపోవడం కాస్త నిరాశ కలిగించినా.. దానిపైన ఎక్కువగా ఆలోచించలేదని స్మరణ్ చెప్పాడు. “నా బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలి. నేను వరుసగా పరుగులు చేస్తే.. అవకాశం ఎప్పటికైనా వస్తుంది” అని అన్నాడు. అంతేకాదు.. రంజీ ట్రోఫీలో ప్రతి సంవత్సరం కొత్త టాప్ స్కోరర్ వస్తుంటాడని, కానీ తన లక్ష్యం మాత్రం టాప్‌లో కొనసాగుతూ పరుగులు చేస్తూనే ఉండటం అని స్మరణ్ స్పష్టం చేశాడు. ఇక మూడు ఫార్మాట్లలోనూ ఆడేందుకు స్మరణ్ ప్రత్యేకంగా ప్రాక్టీస్ చేస్తాడట. రెడ్ బాల్‌తో రెండు రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత.. వైట్ బాల్‌తో ప్రాక్టీస్ చేస్తూ ఉంటానని చెప్పాడు. ఇలా నాలుగు నుంచి ఆరు వారాలు చేస్తే.. శరీరం, మనసు ఫార్మాట్‌కు తగ్గట్టుగా మారిపోతాయని తెలిపాడు. T20 క్రికెట్‌లో కూడా ఎక్కువ పరుగులు చేయాలంటే కొత్త షాట్లు నేర్చుకోవాలని స్మరణ్ భావిస్తున్నాడు. ముఖ్యంగా స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లపై కూడా పని చేస్తున్నాడు.

ఇక IPL విషయానికి వస్తే.. సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్టుతో తన మొదటి పూర్తి సీజన్ మంచి లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్పాడు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, క్లాసెన్, ట్రావిస్ హెడ్ లాంటి ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం ద్వారా చాలా నేర్చుకున్నానన్నాడు. ఇక కర్ణాటక కెప్టెన్ అయ్యే అవకాశం వస్తే మాత్రం తప్పకుండా స్వీకరిస్తానని స్మరణ్ చెప్పాడు. చిన్నప్పుడే కర్ణాటకకు కెప్టెన్‌గా వ్యవహరించి CK నాయుడు ట్రోఫీని కూడా గెలిపించాడు. అయితే స్మరణ్ క్రికెట్ జర్నీ వెనుక అసలు కారణం మాత్రం అతని అమ్మ. చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడట. దీంతో అతని అమ్మే క్రికెట్ కోచింగ్‌లో చేర్పించింది. స్మరణ్ కుటుంబంలో ఎక్కువమంది ఇంజనీర్లు. అయినా క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నందుకు కుటుంబం ఎప్పుడూ ఒత్తిడి చేయలేదు. ఒక విషయము మాత్రం అతని అమ్మ ఇప్పటికీ చెబుతూనే ఉంటుందట.. “క్రికెట్‌తో పాటు చదువును కూడా వదులుకోకూడదు.” అదే మాటను స్మరణ్ కూడా నమ్ముతున్నాడు. క్రికెట్, చదువు రెండింటినీ బ్యాలెన్స్ చేయడం వల్ల క్రమశిక్షణ, జీవితంలో చాలా విషయాలు నేర్చుకున్నానని చెబుతున్నాడు. ఇప్పుడు స్మరణ్ లక్ష్యం ఒక్కటే.. పరుగులు చేస్తూ టాప్‌లో ఉండాలి.. ఆ పరుగులే తనకు టీమిండియా తలుపులు తెరవాలి! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles