Top 5 This Week

Related Posts

6 బంతుల్లో నిరాశ నుంచి డబుల్ ధమాకా.. వైభవ్ సూర్యవంశి రోలర్ కోస్టర్ రైడ్!

దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. కానీ బ్యాటింగ్‌లో మాత్రం కేవలం 6 బంతుల్లోనే 8 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మ్యాచ్‌లో తర్వాత మాత్రం అదే వైభవ్ సూర్యవంశీ డబుల్ ధమాకా చేశాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. నార్త్ ఈస్ట్ జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ,ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న వైభవ్‌పై అందరి దృష్టి ఉంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న వైభవ్.. బ్యాట్‌తో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు.

పేసర్ బిష్వోర్జిత్ కొంథౌజామ్ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన వైభవ్.. చివరికి అదే బౌలర్‌కు చిక్కిపోయాడు. తన ఆరో బంతికే ఔటై పెవిలియన్‌కు చేరాడు. దీంతో దులీప్ ట్రోఫీ అరంగేట్రం వైభవ్‌కు నిరాశగా మారింది. అయితే ఈ మ్యాచ్‌లో వైభవ్‌కు మరో అవకాశం వచ్చింది. అది బ్యాటింగ్‌లో కాదు.. బౌలింగ్‌లో. సుదీప్ కుమార్ ఘరామి 146 పరుగులు, షహబాజ్ అహ్మద్ 167 పరుగులతో అద్భుతమైన సెంచరీలు చేయడంతో ,ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 467 పరుగులు చేసింది.

ఆ తర్వాత ఈస్ట్ జోన్ బౌలర్లు నార్త్ ఈస్ట్ జోన్‌ను కేవలం 111 పరుగులకే ఆలౌట్ చేశారు. దీంతో నార్త్ ఈస్ట్ జోన్‌పై ఫాలోఆన్ విధించారు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా నార్త్ ఈస్ట్ జోన్ పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఒక దశలో 90 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. ఇక్కడే వైభవ్ సూర్యవంశీ తన సత్తా చూపించాడు. తన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో ఒకే ఓవర్‌లో రెండు కీలక వికెట్లు తీశాడు. నార్త్ ఈస్ట్ జోన్ టాప్ స్కోరర్ కిషన్ లింగ్డో 25 పరుగుల వద్ద వైభవ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఆ తర్వాత ఇమ్లివాటి లెమ్తూర్ కూడా కేవలం 4 పరుగులకే వైభవ్‌కు వికెట్‌గా మారాడు. అంతేకాదు, వైభవ్ రెండు అద్భుతమైన క్యాచ్‌లు కూడా పట్టాడు. దీంతో బ్యాట్‌తో విఫలమైనా.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం జట్టుకు కీలకంగా మారాడు. వైభవ్ ఇచ్చిన ఈ ప్రదర్శనను బీసీసీఐ కూడా ప్రత్యేకంగా ప్రశంసించింది. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీయడంతో పాటు రెండు అద్భుతమైన క్యాచ్‌లు పట్టిన వైభవ్‌ను ‘డబుల్ డిలైట్’ అంటూ బీసీసీఐ అభివర్ణించింది.

ఇక ఈ మ్యాచ్‌లో మరో ఆసక్తికరమైన విషయము కూడా కనిపించింది. వైభవ్ జెర్సీ నంబర్‌ను టేప్‌తో కప్పినట్లు కనిపించింది. అందులో ‘3’ అనే నంబర్ మాత్రమే కనిపించింది. దీనికి అసలు కారణం ఏంటో అధికారికంగా తెలియదు. అయితే ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ 3వ నంబర్ జెర్సీనే ధరిస్తాడు. దులీప్ ట్రోఫీ జెర్సీలో నంబర్ ప్రింటింగ్‌లో ఏదైనా సమస్య ఉండటంతో, మిగతా భాగాన్ని టేప్ చేసి ఉండొచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి దులీప్ ట్రోఫీ అరంగేట్రంలో వైభవ్‌కు బ్యాటింగ్‌లో నిరాశ ఎదురైనా.. ఆ తర్వాత బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం డబుల్ ధమాకాతో తన మార్క్ చూపించాడు.

మరి 15 ఏళ్ల ఈ యువ క్రికెటర్ భవిష్యత్తులో టీమిండియాలో ఎంత పెద్ద స్థాయికి ఎదుగుతాడో చూడాలి. “ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!”
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles