Top 5 This Week

Related Posts

ఐపీఎల్‌కు షాక్.. జేకబ్ బెతెల్ నిర్ణయంపై అలిస్టర్ కుక్ ఫైర్!

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ మరోసారి జేకబ్ బెతెల్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఐపీఎల్ కంటే దేశం కోసం ఆడే అంతర్జాతీయ క్రికెట్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ వైరల్ కావడానికి ఒక ప్రధాన కారణం ఉంది. జేకబ్ బెతెల్ మోకాలి గాయంతో ఈ ఏడాది ది హండ్రెడ్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. దీంతో పాకిస్థాన్‌తో జరగబోయే టెస్ట్ సిరీస్‌కు ముందు మ్యాచ్ ప్రాక్టీస్ చేసే మంచి అవకాశం అతను కోల్పోయాడు.

ఇటీవల జరిగిన స్టిక్ టు క్రికెట్ పోడ్‌కాస్ట్‌లో అలిస్టర్ కుక్, ఇంగ్లండ్ మేనేజింగ్ డైరెక్టర్ మో బోబాట్, భారత మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ కలిసి ఈ అంశంపై మాట్లాడారు. ఈ సందర్భంగా కుక్ తన అభిప్రాయాన్ని మరోసారి స్పష్టం చేశారు. అలిస్టర్ కుక్ మాట్లాడుతూ… “నేను చెప్పాలనుకుంటున్నది ఒక్కటే. ఇంకో వారం రోజుల్లో ఇంగ్లండ్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. కానీ మా జట్టులో నంబర్ 3 బ్యాటర్ బెంచ్‌పై కూర్చోవడం సరైన విషయము కాదు. నా అభిప్రాయం ప్రకారం ఇంగ్లండ్ క్రికెట్‌కు ఐపీఎల్ లేదా ఏ ఫ్రాంచైజీ లీగ్ కంటే ఎక్కువ ప్రాధాన్యం ఉండాలి.

నేను అలా అనుకుంటే కొందరికి నచ్చడం లేదు. ఐపీఎల్ ప్రపంచంలోనే గొప్ప టోర్నమెంట్ కావచ్చు. కానీ అందుకే దేశం కోసం ఆడే క్రికెట్‌ను మర్చిపోవద్దు” అని అన్నారు. అంతేకాదు… గత ఏడాది కూడా జేకబ్ బెతెల్ ఎక్కువ మ్యాచ్‌లు ఆడకుండా బెంచ్‌పైనే ఎక్కువ సమయం గడిపాడని కుక్ గుర్తు చేశారు. ఈసారి కూడా అదే పరిస్థితి రావడాన్ని ఆయన ప్రశ్నించారు. “గత సంవత్సరం బెంచ్‌పై కూర్చొని చాలా విషయాలు నేర్చుకున్నాడని చెప్పారు. సరే, నేర్చుకున్నాడు అనుకుందాం. కానీ ఈసారి కూడా ఎక్కువగా బెంచ్‌పైనే కూర్చుంటే ప్రయోజనం ఏమిటి? నేను ఇంగ్లండ్ జట్టు విజయాన్ని చూడాలనుకుంటున్నాను. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు లేదా ఇతర ఫ్రాంచైజీలపై నాకు ఎలాంటి వ్యతిరేకత లేదు.

కానీ నా దేశ జట్టే ముందుగా విజయవంతం కావాలని కోరుకుంటాను” అని కుక్ అన్నారు. ఇక ఈ వ్యాఖ్యలు మరోసారి వార్తల్లో నిలవడానికి మరో కారణం కూడా ఉంది. ఇటీవల భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో జేకబ్ బెతెల్ మోకాలికి గాయమైంది. ఆ గాయం కారణంగా అతను ది హండ్రెడ్ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నీలో బెతెల్ బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాల్సి ఉంది. కానీ గాయం కారణంగా ఆ అవకాశం కూడా కోల్పోయాడు. ఇప్పుడు పాకిస్థాన్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు అతను అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కూడా సందేహంగా మారింది.

అయితే ఈ ఏడాది ప్రారంభంలో జేకబ్ బెతెల్ మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరులో ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రాకపోయినా అక్కడే కొనసాగాలని తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని చెప్పాడు. “ఈ విషయంలో సరైనది, తప్పు అనేది ఉండదు. ఐపీఎల్‌లో ప్రతిరోజూ ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో కలిసి ప్రాక్టీస్ చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోయినా నా ఆట మెరుగుపడింది. ఆ అనుభవం నాకు భవిష్యత్తులో ఉపయోగపడుతుంది” అని బెతెల్ అప్పట్లో చెప్పాడు. ఇప్పుడు ఒకవైపు అలిస్టర్ కుక్ దేశం కోసం ఆడే క్రికెట్‌కే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అంటుండగా… మరోవైపు బెతెల్ మాత్రం ఐపీఎల్‌లో గడిపిన సమయం తన ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడిందని చెబుతున్నాడు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles