Top 5 This Week

Related Posts

భారత్ నాకు మరో ఇల్లు.. ఆస్ట్రేలియా మాజీ స్టార్ షేన్ వాట్సన్ ఎమోషనల్!

భారత్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ షేన్ వాట్సన్ ఆసక్తికర విషయాలు చెప్పాడు. భారత్ తనకు రెండో ఇల్లు లాంటిదని, ఇక్కడి ప్రజలు తన జీవితం, క్రికెట్ కెరీర్‌పై ఎంతో ప్రభావం చూపించారని వాట్సన్ తెలిపాడు. సిడ్నీలోని భారత కాన్సులేట్ నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో షేన్ వాట్సన్ పాల్గొని ప్రసంగించాడు.

భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగం కావడం తనకు ఎంతో గౌరవంగా ఉందని చెప్పాడు. తనకు 19 ఏళ్ల వయసులో తొలిసారి భారత్‌కు వచ్చానని వాట్సన్ గుర్తు చేసుకున్నాడు. అప్పటితో పోలిస్తే ఇప్పుడు భారత్ ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పాడు. అంతేకాదు..

ఆస్ట్రేలియా కంటే భారత్‌లోనే తనకు ఎక్కువ ఆదరణ లభించేదని వాట్సన్ తెలిపాడు. తాను బాగా ఆడినప్పుడు ఆస్ట్రేలియాలో ప్రశంసలు వచ్చేవని, అదే సరిగ్గా ఆడకపోతే విమర్శలు కూడా ఎదురయ్యేవని చెప్పాడు. కానీ భారత్‌లో మాత్రం తనకు ఎప్పుడూ ఎక్కువ మద్దతు లభించేదని వాట్సన్ అన్నాడు.

2008లో ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత తన కెరీర్‌లో కీలక సమయంలో అద్భుతమైన , ప్రదర్శనలు చేసే అవకాశం ఈ లీగ్ ద్వారా లభించిందని చెప్పాడు. వాట్సన్ 2008 నుంచి 2020 వరకు ఐపీఎల్‌లో ఆడాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

ఐపీఎల్‌లో మొత్తం 145 మ్యాచ్‌లు ఆడి 3,874 పరుగులు చేశాడు. అందులో నాలుగు సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 92 వికెట్లు కూడా పడగొట్టాడు. అంతేకాదు.. తనకు భారతీయ శాకాహార వంటకాలు కూడా ఎంతో ఇష్టమని షేన్ వాట్సన్ చెప్పాడు. భారత్ తనకు కేవలం క్రికెట్ ఆడిన దేశం మాత్రమే కాదని.. తన జీవితంలో ప్రత్యేకమైన స్థానం ఉన్న దేశమని వాట్సన్ మాటలు మరోసారి స్పష్టం చేశాయి.

మరి భారత్‌పై షేన్ వాట్సన్ చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన క్రికెట్ వార్తల కోసం మా ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles