నమస్కారం క్రికెట్ అభిమానులారా..! భారత వైట్‌బాల్ జట్టు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొద్ది నెలల క్రితమే వరుసగా రెండో టీ ట్వంటీ ప్రపంచకప్‌ను గెలిచి ప్రశంసలు అందుకున్న టీమిండియా.. ఇప్పుడు వరుస పరాజయాలతో విమర్శల పాలవుతోంది. ఇంగ్లాండ్‌తో నాటింగ్‌హామ్‌లో జరిగిన టీ ట్వంటీ 125 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడం.. భారత టీ ట్వంటీ చరిత్రలో పరుగుల పరంగా అతిపెద్ద ఓటమిగా నమోదైంది. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది.
కేవలం 11.4 ఓవర్లలోనే భారత బ్యాటింగ్ కుప్పకూలడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. అంతేకాదు.. ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో 0 – 2 తో ఓడిన తర్వాత ఇది వరుసగా నాలుగో పరాజయం కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘోర పరాజయం తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందిస్తూ.. మా బ్యాటింగ్ ప్రదర్శన పూర్తిగా నిరాశాజనకమని, ఇలాంటి ఆట అస్సలు అంగీకరించలేమని వ్యాఖ్యానించాడు. అయితే భారత ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం ప్రస్తుతం జట్టు “రీబిల్డ్” దశలో ఉందని చెబుతున్నారు.
కొత్త ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం, జట్టును భవిష్యత్తు కోసం సిద్ధం చేయడం జరుగుతోందని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టగా.. హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు ఈ సిరీస్‌లో లేరు. అయితే కేవలం జట్టులో మార్పులు మాత్రమే ఈ వరుస వైఫల్యాలకు కారణమా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. విదేశీ పిచ్‌లపై పరిస్థితులకు అనుగుణంగా ఆడలేకపోవడం కూడా భారత జట్టుకు పెద్ద సమస్యగా మారింది.
శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీ ఆరంభం ఆశించిన స్థాయిలో లేదు. బ్యాటింగ్‌లో ఆయన వరుసగా 3, 10, 68, 37, 5 పరుగులు మాత్రమే చేయగలిగాడు. కొన్ని మ్యాచ్‌ల్లో కెప్టెన్సీ నిర్ణయాలపైనా విమర్శలు వచ్చాయి. మూడో టీ ట్వంటీ లో తిలక్ వర్మ, శివమ్ దూబే కంటే ముందుగా అక్షర్ పటేల్, హర్షిత్ రాణాలను బ్యాటింగ్‌కు పంపడం ఆశ్చర్యానికి గురిచేసింది. స్పష్టమైన వ్యూహంతో కాకుండా.. ఏదో ప్రయోగాలు చేస్తున్నట్టే కనిపించిందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. భారత బ్యాటర్ల ఆటతీరుపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్‌లో ఫ్లాట్ పిచ్‌లపై దూకుడుగా ఆడటం అలవాటైపోయిందని విశ్లేషకులు అంటున్నారు.
కానీ ఇంగ్లాండ్, ఐర్లాండ్‌లాంటి దేశాల్లో బంతి ఎక్కువగా స్వింగ్ అవుతుంది. అక్కడ ఓపికగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. అయినప్పటికీ భారత బ్యాటర్లు అదే దూకుడు కొనసాగించడంతో వరుసగా వికెట్లు కోల్పోతున్నారు. తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ కొన్ని ఇన్నింగ్స్‌ల్లో మంచి ఆరంభం ఇచ్చినా.. నిలకడగా భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నారు. మరోవైపు సంజూ శాంసన్‌ను జట్టు నుంచి తప్పించి కేవలం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వడంపై కూడా చర్చ కొనసాగుతోంది. సంజూ వరుసగా 5, 0, 1 పరుగులతో విఫలమైనా.. అంత చిన్న వయసులోనే విదేశీ పర్యటనలో వైభవ్‌పై భారీ అంచనాలు పెట్టడం సరైన నిర్ణయమా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
వైభవ్ కూడా రెండు మ్యాచ్‌ల్లో 14, 13 పరుగులకే పరిమితమయ్యాడు. ప్రతిభ ఉన్నప్పటికీ.. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో అతనికి మరింత సమయం ఇవ్వాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. బ్యాటింగ్ మాత్రమే కాదు.. బౌలింగ్ కూడా ఆశించిన స్థాయిలో లేదు. లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఓల్డ్ ట్రాఫర్డ్‌లో 60 పరుగులు సమర్పించడమే కాకుండా.. మూడు బ్యాక్ – ఫుట్ నో – బాల్స్ వేయడం భారత జట్టు ప్రస్తుత పరిస్థితిని స్పష్టంగా చూపించింది. గౌతమ్ గంభీర్ చేపట్టిన రీసెట్ ప్రక్రియ భవిష్యత్తు దృష్ట్యా అవసరమే కావచ్చు. కానీ విజయవంతమైన మార్పు కోసం స్పష్టమైన వ్యూహం, సరైన జట్టు ఎంపిక, పరిస్థితులకు తగ్గట్టు ఆడే సామర్థ్యం చాలా అవసరం. ప్రస్తుతం భారత్ ప్రపంచకప్ గెలిపించిన నిర్భయమైన క్రికెట్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తోంది.
కానీ ఆ విజయాల వెనుక ఉన్న అనుభవజ్ఞులైన ఆటగాళ్ల లేమి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సంక్షోభం నుంచి భారత జట్టు త్వరగా బయటపడుతుందా..? లేక ఈ వరుస పరాజయాలు ఇంకా కొనసాగుతాయా..? అనేది రాబోయే మ్యాచ్‌ల్లో తేలనుంది.


