భారత క్రికెట్‌లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించాడు. అయితే ఇప్పుడు అతడికి పోటీగా మరో యువ బ్యాటర్ సంచలన ప్రదర్శన చేశాడు. ఆసక్తికరమైన విషయము ఏంటంటే.. అతను కూడా వైభవ్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ జట్టులోనే ఆడుతున్నాడు! విండ్‌హోక్‌లో జరిగిన ట్రై సిరీస్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా, నమీబియాపై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా గెలుపుకు ప్రధాన కారణం యువ బ్యాటర్ లువాన్-డ్రే ప్రిటోరియస్. కేవలం 53 బంతుల్లోనే 101 పరుగులు చేసిన ప్రిటోరియస్.. తన తొలి T20 అంతర్జాతీయ సెంచరీని నమోదు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఈ సెంచరీతో ప్రిటోరియస్ ఏకంగా ఓ ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. 20 సంవత్సరాల 161 రోజుల వయసులో, ఫుల్ మెంబర్ దేశంపై T20 అంతర్జాతీయ సెంచరీ చేసిన అత్యంత చిన్న వయసు బ్యాటర్‌గా నిలిచాడు.
అంతకుముందు ఈ రికార్డు అఫ్గానిస్థాన్ బ్యాటర్ హజ్రతుల్లా జజాయ్ పేరుతో ఉంది. 2019లో ఐర్లాండ్‌పై 20 సంవత్సరాల 337 రోజుల వయసులో అతను సెంచరీ చేశాడు. ఇప్పుడు ప్రిటోరియస్ పేరు వైభవ్ సూర్యవంశీతో పోల్చడం మొదలైంది. ఎందుకంటే వైభవ్‌కు కేవలం 15 ఏళ్లే. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అత్యంత చిన్న వయసు ఆటగాడిగా, అంతర్జాతీయ హాఫ్ సెంచరీ చేసిన అత్యంత చిన్న వయసు ఆటగాడిగా రికార్డులు సృష్టించాడు.
జింబాబ్వేపై మ్యాచ్‌లో వైభవ్ 49 బంతుల్లో 81 పరుగులు చేసి తొలి అంతర్జాతీయ సెంచరీకి చాలా దగ్గరగా వచ్చాడు. అయితే ఇప్పుడు అతడి రాజస్థాన్ రాయల్స్ సహచరుడు ప్రిటోరియస్ కూడా సెంచరీతో సత్తా చాటడంతో.. వైభవ్‌కు పోటీ పెరిగిందా అనే చర్చ మొదలైంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ప్రిటోరియస్, కానర్ ఎస్టర్‌హైజెన్ కలిసి తొలి వికెట్‌కు 156 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
దీంతో దక్షిణాఫ్రికా 228 పరుగులు చేసింది. నమీబియా కూడా గట్టిగా పోరాడింది. కానీ 217 పరుగులకే ఆగిపోయింది. దీంతో దక్షిణాఫ్రికా 11 పరుగులతో విజయం సాధించింది. మరి వైభవ్ సూర్యవంశీ ముందుగా అంతర్జాతీయ సెంచరీ చేస్తాడా? లేక అతడి రాజస్థాన్ రాయల్స్ సహచరుడు ప్రిటోరియస్ మరిన్ని రికార్డులు సృష్టిస్తాడా? చూడాలి!


